సామాజిక రుగ్మతలపై దృష్టిపెట్టండి

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు తమ వృత్తిని సమాజసేవగా భావించాలని, కేటాయించిన విధులను మామూలుగా కాకుండా ఉత్తమ సేవలు అందించడమే అభిరుచిగా అలవాటు చేసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. పేదరికాన్ని నిర్మూలించడంతోపాటు లింగవివక్ష ఇతర సామాజిక రుగ్మతలను నివారించడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, సీసీఎస్‌ అధికారులు, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ అధికారులకు రెండో ఫౌండేషన్‌ కోర్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడంలో సివిల్‌ సర్వెంట్‌ అధికారులు ముందువరుసలో ఉండాలన్నారు.