నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూ అబ్దుల్లా ఇవాళ రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన శ్రీనగర్‌లో మాట్లాడారు. ఈ సమయంలో మాట్లాడేందుకు తనకు మాటలు రావడం లేదన్నారు. ప్రస్తుతం స్వేచ్ఛా జీవినయ్యానంటూ ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఫారూక్ తెలిపారు. పార్లమెంట్‌లో మాట్లాడనున్నాని, ప్రతి ఒక్కరి కోసం తన గళాన్ని వినిపించనున్నట్లు ఫారూక్ చెప్పారు. ఏడు నెలల గృహ నిర్బంధం తర్వాత ఫారూక్ అబ్దుల్లా ఇవాళ విముక్తి అయ్యారు. కశ్మీర్‌లో గత ఏడాది ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పలువురు నేతల్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అయిన వారిలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాతో పాటు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఉన్నారు. ప్రతి ఒక్కర్నీ విడుదల చేసే వరకు ఎటువంటి రాజకీయ అంశాలపై మాట్లాడను అని ఆయన అన్నారు. తమ స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన రాష్ట్ర ప్రజలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక నేత రిలీజైనప్పుడే ఈ స్వేచ్ఛకు అర్థం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఫారూక్ తెలిపారు.